© 2026 nimisham.in

బద్వేలు, న్యూస్టుడే: బద్వేలులోని తెలుగుగంగ కాలనీలో కొంత కాలంగా గోప్యంగా సాగుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మోసపూరితమైన జూదం ఆడుతున్న ఓ ముఠా గుట్టును బుధవారం పట్టణ పోలీసులు రట్టు చేశారు.
బుధవారం స్థానిక పోలీసు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బద్వేలు రామాంజనేయనగర్కు చెందిన పి.శ్రీకాంత్, రామకృష్ణ, సుమిత్రానగర్ షేక్ అజీజ్, శివానగర్ ఎన్.శ్రీను, కె.మాబూరసూల్, మడకలవారిపల్లెకు చెందిన వి.హరి, ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం చెందిన పి.వెంకటరమణ, వల్లూరు మండలం గోటూరుకు చెందిన ఎన్.సాంబయ్య, సి.శివారెడ్డిలు కలిసి తెలుగు గంగ కాలనీలోని ఓ ఇంట్లో హైటెక్ జూదం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పట్టణ ఎస్ఐలు రంగారావు, జయరాములు పోలీసు సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఈ ముఠా సభ్యుల నుంచి రూ.40,500 నగదు, ఎలక్ట్రానిక్ డివైస్లు, మూడు ఐఫోన్లు, ఆడియో పరికరాలు, మూడు డిజిటల్ ఇయర్ఫోన్లు, రెండు బ్లూటూత్ పరికరాలు, 35 లిక్కర్ సీసాలు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా పేక ముక్క లోపల బయట ఎక్కడ పడేదీ తెలుస్తుందని, జూదం ఆడేందుకు వచ్చిన వారిని ఈ ముఠా సభ్యులు మోసం చేసి డబ్బులు సంపాదించే వారని డీఎస్పీ వివరించారు. కువైట్లో స్నేహమైన ఈ ముఠా సభ్యులంతా బద్వేలులో ఆధునిక పరిజ్ఞానంతో జూదం ఆడుతూ పట్టుపడినట్లు తెలిపారు. ఈ ముఠాను బద్వేలు న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో బద్వేలు గ్రామీణ సీఐ కృష్ణయ్య పట్టణ ఎస్ఐలు రంగారావు, జయరాములు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.