© 2026 nimisham.in
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గాదె సాయికృష్ణ కేసులో నిందితులకు విజయవాడ కోర్టు లో చుక్కెదురైంది. ఈ కేసులో నలుగురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
సస్పెండ్ అయిన సీఐ నాగరాజుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వీరు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుళ్లు జంగం నాని, బాబూరావుతో పాటుగా సాంబయ్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను విజయవాడ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఏ1గా ఉన్న నాగరాజు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, జంగం నాని ఏలూరు సబ్ జైలులో, సాంబయ్య గన్నవరం సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. వీరంతా తమకు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం డిస్మిస్ చేసింది.మరోవైపు సాయికృష్ణ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పోలీస్ కస్టడీలో సాయికృష్ణ చనిపోయాడనే ఆరోపణలు సంచలనం రేపాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై సిట్ ఏర్పాటు చేసింది. ఐజీపీ రవిప్రకాష్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు బృందం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించింది. అనంతరం నాగరాజు, ముగ్గురు పోలీస్ సిబ్బందిని కూడా అరెస్ట్ చేశారు. వీరంతా వేర్వేరు జైళ్లల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.అయితే ఈ కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. లాకప్ డెత్ లాంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్న నేపథ్యంలో.. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు దర్యాప్తు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని భావించిన కోర్టు.. పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిందితులు రిమాండ్ ఖైదీలుగానే కొనసాగనున్నారు. మరోవైపు సాయికృష్ణ కేసులో విచారణను మరింత వేగవంతం చేసి, పక్కా సాక్ష్యాధారాలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.